జోహన్నెస్‌బర్గ్ : జోహన్నెస్‌బర్గ్‌లోని ఓఆర్ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 ఏళ్ల బాలుడికి వింత అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్ వెళ్లే విమానం ఎక్కేందుకు వచ్చిన బాలుడిని బోర్డింగ్ వద్ద విమాన సిబ్బంది అడ్డుకొని నువ్వు వేసుకున్న షర్ట్‌ను విప్పితేనే విమానంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇంతకీ షర్ట్ ఎందుకు విప్పమన్నారనేగా మీ డౌటు.. అక్కడికే వసున్నాం !
న్యూజిలాండ్‌లో ఉండే తమ బంధువులను కలిసేందుకు దంపతులు తమ 10 ఏళ్ల స్టీవ్‌తో కలిసి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే విమానం ఎక్కడానికి బోర్డింగ్ దగ్గరకు వచ్చారు. విమాన సిబ్బంది స్టీవ్‌ను అడ్డుకొని షర్ట్ మార్చుకోవాలని సూచించారు. కాగా స్టీవ్ వేసుకున్న షర్ట్‌పై కింగ్ కోబ్రా పాము బొమ్మ ముద్రించబడి ఉంది. ఆ బొమ్మ చూడడానికి కాస్త భయంకరంగా ఉండడంతో తోటి ప్రయాణికులు బొమ్మను చూసి భయానికి లోనవుతారంటూ అందుకే సిబ్బంది షర్ట్‌ను మార్చుకోవాలని సలహా ఇచ్చారు.
కానీ మొదట ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినా చేసేదేం లేక స్టీవ్ వేరే షర్ట్‌ను తొడిగి విమానం ఎక్కారు. అయితే అధికారులు తాము చేసిన పని సరైందేనంటూ సమర్థించుకున్నారు. ఆ అబ్బాయి వేసుకున్న షర్టువల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే, అయినా అలాంటి దుస్తులను మేం అంగీకరించబోమని వెల్లడించారు. దీనిపై ఒక సంస్థ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ' ఆ బాలుడిని అడ్డగించి బలవంతంగా షర్టు మార్చుకోమని ఒత్తిడి తెచ్చారు. అతను వేసుకున్న షర్టుపై ఒక పాము బొమ్మ ఉండడమే దీనికి కారణం' అంటూ ట్వీట్ చేశారు. ట్విటర్‌లో షేర్ చేసిన ఫోటోలను చూసి ' ఇవేం రూల్స్‌రా బాబు...దుస్తులపై బొమ్మలు ఉంటే విమానం ఎక్కనివ్వరా అంటూ' నెటిజన్లు మండిపడుతున్నారు.